జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్కడి ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణం చేశారు. టోక్యో నుంచి సెందాయ్ వరకు హై-స్పీడ్ రైలులో ఇద్దరూ కలిసి ప్రయాణించిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా మోదీ భారత్–జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్ల తయారీ, వాణిజ్య పెట్టుబడులు ప్రధాన అజెండాగా కొనసాగుతున్నాయి. అలాగే పలువురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో, పెట్టుబడిదారులతో మోదీ సమావేశమయ్యారు. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ చైనాకు వెళ్ళనున్నారు. రేపు 31న బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తరువాత సెప్టెంబర్ 1న తియాన్జిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు ఆయన హాజరవుతారు.
ఈ చైనా పర్యటన దౌత్యపరంగా ఎంతో కీలకం కానుంది. లడఖ్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల తర్వాత భారత్–చైనా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, జిన్‌పింగ్‌తో మోదీ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో, మోదీ చైనా పర్యటనపై అంతర్జాతీయంగా విశేష ఆసక్తి నెలకొంది.


Read More : సుప్రీంకోర్టుకు సవాల్ చేసిన ట్రంప్ .

One thought on “జపాన్‌లో బుల్లెట్ రైలు ప్రయాణం చేసిన మోదీ.”
Comments are closed.