అత్యాచారం ఆరోపణలపై పీసీబీ సస్పెన్షన్

పాకిస్థాన్ క్రికెట్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. జట్టు యువ బ్యాట్స్‌మన్, 24 ఏళ్ల హైదర్ అలీపై యూకేలో అత్యాచారం ఆరోపణలు రావడంతో, గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పాకిస్థాన్ ‘ఏ’ జట్టైన పాకిస్థాన్ షాహీన్స్‌తో కలిసి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న హైదర్‌పై పాకిస్థాన్ మూలాలున్న ఒక యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే… పాక్ షాహీన్స్ జట్టు జూలై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకే పర్యటనలో ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 3న బెక్హెమ్ మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా, పోలీసులు హైదర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని బెయిల్‌పై విడుదల చేస్తూ, తదుపరి విచారణలకు హాజరుకావాలనే షరతుతో పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెంటనే స్పందించింది. యూకే చట్టపరమైన ప్రక్రియలకు తాము పూర్తిగా సహకరిస్తామని, విచారణ పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని పీసీబీ ప్రకటనలో తెలిపింది. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని, యూకేలో అంతర్గత విచారణ కూడా జరుపుతామని పీసీబీ ప్రతినిధి వెల్లడించారు.

పోలీసుల అదుపులో ఉన్న సమయంలో హైదర్ అలీ తాను నిర్దోషినని చెబుతూ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రతిభావంతుడైన ఈ ఆటగాడు పాకిస్థాన్ తరఫున రెండు వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పాక్ వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్ ప్రణాళికల్లో ఉండి, త్వరలో షార్జాలో జరగనున్న టీ20 ట్రై-సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశముండగా, ఈ వివాదం అతని కెరీర్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టింది. 2010లో ఇంగ్లండ్‌లోనే స్పాట్ ఫిక్సింగ్ కేసులో సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ అరెస్టయిన ఘటనను ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

Read More : ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్

One thought on “అత్యాచారం ఆరోపణలపై పీసీబీ సస్పెన్షన్

Comments are closed.