తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ – టీజీపీఎస్సీ గ్రూప్ ఫలితాల షెడ్యూల్ విడుదల

tspsc-group-exam

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను టీఎస్పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సహా వివిధ నియామక పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించింది.

గ్రూప్ ఫలితాల విడుదల తేదీలు

మార్చి 10న గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కులను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మార్చి 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా, మార్చి 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా, మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు, మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్య

  • గ్రూప్-1: 563 పోస్టుల భర్తీ కోసం 2024 అక్టోబర్ 21-27 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 31,000 మంది అభ్యర్థుల్లో 21,000 మంది మెయిన్స్ రాశారు.
  • గ్రూప్-2: 783 పోస్టుల కోసం 2024 నవంబరులో పరీక్ష నిర్వహించగా, 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
  • గ్రూప్-3: 1,363 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 2.69 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

ఈ ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, షెడ్యూల్ విడుదల కావడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని హెచ్చరిక

ఈ సందర్భంగా టీజీపీఎస్సీ ఒక కీలక ప్రకటన చేస్తూ, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అభ్యర్థులను హెచ్చరించింది. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేయడానికి ప్రయత్నిస్తే, వెంటనే టీజీపీఎస్సీ అధికారులను సంప్రదించి కంప్లైంట్ ఇవ్వాలని సూచించింది.

Read More