నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ లాబీయింగ్ అంతర్జాతీయ చర్చ.

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న తీరు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. నోబెల్ అవార్డుల కోసం అధ్యక్షుడే బహిరంగంగా లాబీయింగ్ చేయడం అరుదైన పరిణామంగా నిలిచింది. అక్టోబర్‌లో విజేత పేరును ప్రకటించేందుకు కమిటీ చర్చలు జరుగుతున్న వేళ ఈ సంఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ట్రంప్‌ను శాంతి దూతగా చూపించేందుకు ఆయన మంత్రివర్గం ముందుకు వచ్చింది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, “మీరు నోబెల్ బహుమతికి అత్యంత అర్హులు” అని వ్యాఖ్యానించారు. లేబర్ సెక్రటరీ లోరి ఛావేజ్-డి రేమర్ తన కార్యాలయంలో ట్రంప్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆయనను “కార్మికుల కోసం పరివర్తనాత్మక అధ్యక్షుడు”గా కొనియాడారు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో ట్రంప్ స్వయంగా లాబీయింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గత నెలలో నార్వే ఆర్థిక మంత్రితో టారిఫ్ చర్చల మధ్య నోబెల్ నామినేషన్ విషయాన్ని ప్రస్తావించారని అక్కడి మీడియా వెల్లడించింది.

అయితే, ఈ ప్రయత్నాలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, “అమెరికన్ పౌరులపై సైన్యాన్ని ఉపయోగించిన వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడం సరికాదు” అని విమర్శించారు. ఇజ్రాయెల్ జర్నలిస్ట్ గిడియాన్ లేవీ, “ట్రంప్‌కు స్థానం నోబెల్ వేదికపై కాదు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో” అని ఎద్దేవా చేశారు.

నార్వే నోబెల్ కమిటీలో కూడా ట్రంప్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కమిటీ చైర్మన్ జోర్గెన్ ఫ్రైడ్నెస్, “ట్రంప్ తన రెండో పదవీకాలంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి, మీడియాపై వందకు పైగా దాడులు చేశారు” అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ, ఒక అధ్యక్షుడు మరియు ఆయన కేబినెట్ ఇంత బహిరంగంగా నోబెల్ కోసం లాబీయింగ్ చేయడం చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా వారు అభిప్రాయపడుతున్నారు.

Read More : భారత్‌పై ట్రంప్ వాణిజ్య ఒత్తిళ్లు.

One thought on “నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ లాబీయింగ్ అంతర్జాతీయ చర్చ.

Comments are closed.