ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి టాలీవుడ్‌లో కలకలం రేగింది. పలు యాప్‌లకు ప్రచారం చేసిన సినీ ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించనుంది. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు. వీరిలో నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, హర్షసాయి, టేస్టీ తేజ, భయ్యా సన్నీయాదవ్ తదితరుల పేర్లు ఉన్నాయి. ఈడీ చర్యలకు సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా బలం చేకూరింది. గతంలో పోలీసుల వద్ద ఈయాప్‌లపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా నిధులను సేకరిస్తున్నాయన్న ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ యాప్‌లకు విస్తృత ప్రచారం చేస్తూ, భారీ పారితోషికాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ విచారణ చేయనుంది.

పోలీసుల ప్రకారం, ఈ యాప్‌ల కారణంగా పలువురు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడినట్లు కేసులో పేర్కొన్నారు. కొన్ని కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని కూడా తెలిపారు. ఇప్పుడు ఈ వివాదం ఎలాంటి మలుపు తియ్యనుందో వేచి చూడాలి.

Read More : శ్యామాలి పోస్ట్‌తో సమంత–రాజ్ వార్తలు హాట్ టాపిక్