తిరుపతి రూరల్లోని మంగళం రిక్షా కాలనీలో ఒక్కసారిగా దారుణం చోటుచేసుకుంది.కుటుంబ వివాదాలు, భార్యపై అనుమానాల మధ్య భర్త భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, మంగళం రిక్షా కాలనీకి చెందిన ఉషా (34) అనే మహిళ అమర్ రాజా ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఉదయం 5 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తుండగా భర్త లోకేశ్వర్ దారికాచి కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చాడు. ఇటీవల ఉషా తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. భర్త లోకేశ్వర్ నిరుద్యోగిగా ఉండటం, పలు అనుమానాలు కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఉషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు.
హత్య అనంతరం లోకేశ్వర్ తిరుమల నగర్ ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాలను ఏఎస్సీ రవి మనోహరాచారి, సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ దారుణ ఘటనతో వీరి ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
Read More : విశాఖ ఐటీసీ గోదాములో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

One thought on “భార్యపై అనుమానంతో భర్త హత్య, అనంతరం ఆత్మహత్య”
Comments are closed.