తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం, నిపుణులతో కూడిన కమిటీని సోమవారం లోపు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఈ కమిటీలో కేంద్రం, రెండు రాష్ట్రాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడాల్సిన అవసరం ఉందని చర్చలో స్పష్టం అయ్యిందన్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మత్తులు, రక్షణ చర్యలపై నిపుణుల నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ భేటీ సుమారు గంటన్నర పాటు సత్సభ వాతావరణంలో సాగిందని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే దృక్పథంతో చర్చించాయని చెప్పారు. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డును అమరావతిలో, గోదావరి బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.
సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. గోదావరిలో ప్రతి సంవత్సరం సముద్రంలోకి వృథా వెళ్లే 2,000-3,000 టీఎంసీల నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే, ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికి నష్టం లేకుండా గోదావరిలో మిగిలిపోయే నీటిని వినియోగించాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రతిపాదించిన 13 అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ అంశాల్లో ఏపై నుంచి ఏమీ అభ్యంతరం రాలేదని తెలుస్తోంది.
Read More : రప్పా.. రప్పా వ్యాఖ్యలపై మరోసారి వైఎస్ జగన్

One thought on “జల వివాదాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు : Minister”
Comments are closed.