19 జిల్లాలకు హెచ్చరికలు, మత్స్యకారులకు సూచనలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు, ఉత్తర బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు.

తెలంగాణకు ప్రత్యేక హెచ్చరికలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రపై అధిక ప్రభావం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

మత్స్యకారులకు తీవ్ర హెచ్చరిక
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. తదుపరి సూచనలు వెలువడే వరకు ఎదురుచూడాలని కోరారు.

Read More : Kishan Reddy: బీజేపీలో పదవులకంటే కార్యకర్తలే బలం