బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించి పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు పెద్దగా ముఖ్యం కావని, ఎవరు నాయకుడిగా ఉన్నా కార్యకర్తలే పార్టీకి అసలైన శక్తి అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా అందరూ ఐక్యంగా పనిచేయాలన్నది తన అభిప్రాయమని తెలిపారు.
రామచందర్‌రావుకు మద్దతు, ఐక్యతపై పిలుపు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్‌రావు నాయకత్వంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
మంగళవారం హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలూ కుటుంబ పాలన, అవినీతి ద్వారా రాష్ట్రాన్ని దోచుకున్నాయన్నారు.
కేంద్రం సహకారమే అభివృద్ధికి కారణం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, జరుగుతున్న పనులన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారమే కారణమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని తమవేనని చెప్పే వారికి ఇది తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read More : బీజేపీకి కొత్త రాష్ట్రాధ్యక్షులు

One thought on “Kishan Reddy: బీజేపీలో పదవులకంటే కార్యకర్తలే బలం”
Comments are closed.