తెలుగురాష్ట్రాల్లో వాతావరణ మార్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు భగభగమంటూ ఎండల వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా , మరోవైపు సడెన్‌గా వచ్చే అకాల వర్షాలు ప్రజల జీవనశైలిని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. వడగాలులు, ఉక్కపోత, వర్షం ఇలా సమాంతరంగా సాగుతున్న వాతావరణం అన్ని వయస్సుల వారినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని జిల్లాల్లో 41-43 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండగా, రాయలసీమలో అట్లూరు మండలంలో 41.4 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం వేళల్లో (11 నుంచి 3 గంటల మధ్య) బయటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. వడగాలుల తీవ్రత ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు అని అధికారులు వెల్లడిస్తున్నారు. వర్షం కురిసే అవకాశాలతో పాటు తేమ స్థాయిలు పెరగడం వల్ల ఉక్కపోత మరింత తీవ్రమవుతోంది. ఈ కారణంగా వ్యవసాయ పనులపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. వడగాలులు ఇప్పటికే ఏపీలో 66 మండలాల్లో, 7 మండలాల్లో తీవ్రమైన స్థాయిలో నమోదయ్యాయి.
ఏప్రిల్ 13 నుంచి 16 మధ్య తెలంగాణ, ఏపీలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో 16 జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొంది. అసాధారణ ఉపరితల ఆవర్తనాల కారణంగా ఏర్పడుతున్న ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

2 thoughts on “ఏపి, తెలంగాణలో అకాల వర్షాలు – ఉష్ణోగ్రతల పెరుగుదలతో అప్రమత్తత అవసరం!”
Comments are closed.