తెలంగాణ హైకోర్టు వక్ఫ్ బోర్డు వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి..

తెలంగాణ హైకోర్టు వక్ఫ్ బోర్డు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానిస్తూ, వక్ఫ్ బోర్డు దివ్య ఖురాన్ స్ఫూర్తిని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం హైకోర్టులో వక్ఫ్ బోర్డు వ్యవహారశైలిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఈ కేసుల విచారణలో మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇబాదత్‌ఖానా స్వాధీనంపై హైకోర్టు గతేడాది స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, దాని నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. అయితే, తాజా విచారణలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో జాప్యం జరిగిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

వక్ఫ్ బోర్డు పేదల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక ఖురాన్‌లోని కొన్ని భాగాలను ఉటంకిస్తూ, వాటి స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, కేసులో పిటిషనర్ వైఖరిపై కూడా అసహనం వ్యక్తం చేశారు.

Read More : సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో తెలంగాణ నేతల భేటీ..