తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం మాటలు పచ్చి అబద్ధాలని మండిపడ్డ బండి సంజయ్, ‘‘బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చెప్పడం అత్యంత బాధాకరం. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలను భయపెట్టేలా మాట్లాడడం సరికాదు,’’ అని హెచ్చరించారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘రాష్ట్రానికి అప్పు పుట్టలేదు అనే మాటలు పూర్తిగా అసత్యం. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌లు రాలేదని చెప్పడం దుర్మార్గం. అప్పు కోసం వెళ్లిన ముఖ్యమంత్రి చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలా చూస్తున్నారన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ సంస్కృతినే సూచిస్తున్నాయి,’’ అని ఎద్దేవా చేశారు.
‘‘రాష్ట్రానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి స్వయంగా దివాళా తీసిందని భయాందోళన కలిగించడమేంటి? ఇది ప్రజల్లో భయం పెంచే చర్య. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పరిపాలన చేయలేనని అర్థమైంది. హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ప్రజలను గాలికి వదిలేసినట్లుగా వ్యవహరిస్తున్నారు,’’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎన్నికల ముందు రాష్ట్రంపై రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసిన కాంగ్రెస్, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతోనే ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదని స్పష్టమవుతోందన్నారు.
వృద్ధులకు రూ. 4,000 పింఛన్, మహిళలకు నెలకు రూ. 2,500, తులం బంగారం, నిరుద్యోగులకు రూ. 4,000, విద్యార్థులకు రూ. 5 లక్షల భరోసా వంటి హామీలు ఇప్పుడూ అబద్ధమని తేలిందన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల సంగతేంటో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు వెంటనే సమాధానం ఇవ్వాలి,’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Read More : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

One thought on “బండి సంజయ్ ఫైర్..”
Comments are closed.