బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ బీజేపీ తన వైఖరిని మార్చుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అయితే, ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర బీజేపీ వైఖరిపై అమిత్ షా కఠినంగా ప్రశ్నించినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అమిత్ షా క్లాస్ అనంతరం, రాష్ట్ర బీజేపీ ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది.
అసెంబ్లీలో మద్దతు.. ఇప్పుడు వెనక్కు?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన నిర్వహించగా, బీసీ జనాభా 56.36%గా ఉన్నట్లు తేలింది. ఈ ఆధారంగా, 29% రిజర్వేషన్లను 42%కి పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును అంగీకరించదనే ప్రచారం తప్పుడు సమాచారమని వ్యాఖ్యానించారు. కానీ, ఢిల్లీ సమావేశం అనంతరం, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తమ స్వరాన్ని మార్చుకోవడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
అమిత్ షా ప్రభావం.. తెలంగాణ బీజేపీ నూతన వైఖరి
అమిత్ షాతో భేటీ తర్వాత, ముస్లింలను బీసీల జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటించింది. కేంద్ర హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల వల్లే రాష్ట్ర బీజేపీ ఇప్పుడు వెనక్కి తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ, ఇప్పుడు వెనుకడుగు వేయడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీస్తోంది.
Read More : రంజాన్ తోఫాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం: హరీష్ రావు

One thought on “తెలంగాణ బీజేపీపై అమిత్ షా క్లాస్.. ?”
Comments are closed.