ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరో భారీ పెట్టుబడికి తెరలేపింది. ప్రముఖ సంస్థ టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, రాష్ట్రంలో 7 గిగావాట్ల (7,000 మెగావాట్లు) సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఈ పెట్టుబడుల విలువ రూ. 49,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అడుగులు వేస్తున్నాం. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీతో ఒప్పందం పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక ముందడుగుగా నిలుస్తుంది. రాష్ట్రంలో ఈ రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం’’ అని తెలిపారు.
పునరుత్పాదక ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో పునరుత్పాదక ఇంధన కేంద్రంగా ఎదగనుందని, తద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కూడా లభించనున్నాయని నారా లోకేష్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దీని ద్వారా 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు వెల్లడించారు.
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, NREDCAP ఎండి కమలాకర్ బాబు, టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సీఏఫ్ఓ అమిత్ మిమానీ, గ్రూప్ హెడ్ తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ (స్ట్రాటజీ) గరిమా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

One thought on “ఏపీలో భారీ పెట్టుబడి – టాటా రెన్యూవబుల్ ఎనర్జీతో కీలక అవగాహన ఒప్పందం”
Comments are closed.