కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీలకు కోట్లాది రూపాయలు వెచ్చించిన రేవంత్ ప్రభుత్వం, సాంప్రదాయ పండుగ అయిన సరస్వతీ పుష్కరాల నిర్వహణకు కేవలం రూ.35 కోట్లు కేటాయించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నిధులతో భక్తులకు ఎలా సౌకర్యాలు కల్పిస్తారని ప్రశ్నించారు.
బండి సంజయ్ సోమవారం తన సతీమణి అపర్ణతో కలిసి కాళేశ్వరం పుష్కర ఘాట్‌ను సందర్శించి, పుష్కర స్నానాన్ని ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు హాజరైనా, అక్కడ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. కానీ తెలంగాణలో కేవలం 50 లక్షల మంది భక్తుల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేయడం రేవంత్ సర్కార్‌కు చేతకాకపోతోంది” అన్నారు.
పుష్కరాలకే తక్కువ ప్రాధాన్యత
బండి సంజయ్ మాట్లాడుతూ, “ఆధ్యాత్మికతను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు రూ.300 కోట్లు ఖర్చు చేయడమంటే, ప్రజల సెంటిమెంట్స్‌ను అవమానించడమే” అని వ్యాఖ్యానించారు. “జనస్రవంతంతో నిండే పుష్కరాలకు కనీస సదుపాయాలైనా కల్పించకుండా ప్రభుత్వ నిర్వాకం అర్ధం కాదు” అని అన్నారు.
పట్టించుకోని హామీలు, వాస్తవాలు
గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ఆలయానికి రూ.100 కోట్లు ఇవ్వాలన్న హామీ అమలు చేయలేదని గుర్తు చేసిన బండి సంజయ్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా రూ.200 కోట్లు ఇస్తామని చెప్పినా, ఎలాంటి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. “వాగ్దానాలతో కాదు.. తగిన ప్రణాళికతో కాళేశ్వరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి” అని సూచించారు.
భక్తులకు శుభాకాంక్షలు
“సరస్వతీ పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమమైన కాళేశ్వరం వద్ద స్నానం చేయడం ఎంతో పుణ్యఫలమైందిగా భావిస్తున్నాను. దేశ ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించా” అని బండి సంజయ్ తెలిపారు.
Read More : పాలమూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం

One thought on “రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు.”
Comments are closed.