సుదీర్ఘ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి సురక్షితంగా చేరిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. ఈ మేరకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
సునీతా విలియమ్స్ తన మూడో అంతరిక్ష యాత్రలో భాగంగా వివిధ సాంకేతిక కారణాల రీత్య 286 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఈ సమయాన్ని కలుపుకుని ఆమె ఇప్పటివరకు మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనతను సాధించారు. ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా మానవాళికి స్ఫూర్తిదాయకమని స్పీకర్ వ్యాఖ్యానించారు.
సునీతా విలియమ్స్ శాస్త్రీయ పరిశోధనల పట్ల ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసే ఆత్మస్థైర్యం ప్రశంసనీయమని అన్నారు. మానవాళి నిరంతర ప్రగతిలో ఇలాంటి సాహసయుక్త ప్రయాణాలు ఎంతో కీలకమని స్పీకర్ అభిప్రాయపడ్డారు.
సునీతా విలియమ్స్ బృందం ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జల్లో పారాషూట్‌ల సాయంతో డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా భూమ్మీదకు చేరుకుంది. అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ యాత్ర కారణంగా శరీర దారుడ్యాన్ని కోల్పోయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ 45 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. భూవాతావరణానికి వారి శరీరాలు పూర్తిగా అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
ఇక వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు చేర్చినందుకు స్పేస్ ఎక్స్, నాసా బృందాలను ప్రముఖ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అభినందించారు. ఈ మిషన్‌కు ప్రాధాన్యత ఇచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
One thought on “సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరిక: ఏపీ అసెంబ్లీ అభినందనలు”
Comments are closed.