కర్నూలు యువతి సుగాలి ప్రీతి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. పవన్ గొంతెత్తకపోయి ఉంటే ఈ కేసు ఎప్పుడో మరుగున పడిపోయేదని పేర్కొంటూ, సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది.
జనసేన విడుదల చేసిన ప్రకటనలో, 2017 ఆగస్టులో జరిగిన హత్య కేసు 2019 డిసెంబర్‌లో తొలిసారి పవన్ దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా బాధిత కుటుంబం పార్టీ కార్యాలయానికి వచ్చి సహాయం కోరినప్పుడు పవన్ కదిలిపోయారని, న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చారని వివరించింది. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో చర్చకు రావాలని, లేకపోతే కర్నూలులో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసింది.
ప్రభుత్వం స్పందించకపోవడంతో, 2020 ఫిబ్రవరి 12న ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ పేరుతో పవన్ భారీ ర్యాలీ నిర్వహించారని జనసేన తెలిపింది. ఆ సభలోనే ప్రీతి తల్లి పార్వతి, తమ బిడ్డకు న్యాయం కోసం గళం విప్పిన తొలి నాయకుడు పవన్ కల్యాణే అని స్పష్టంగా చెప్పారని గుర్తుచేసింది. పవన్ ఒత్తిడితోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 27న కేసును సీబీఐకి బదిలీ చేసిందని పేర్కొంది.
అయితే సీబీఐ విచారణ ముందుకు సాగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనని ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ ఈ కేసును మరిచిపోలేదని, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రీతి తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారని జనసేన తెలిపింది. విచారణ వేగవంతం చేయాలని హోంమంత్రి అనితకు సూచించడమే కాకుండా, బాధితులు ఆమెను కలవాలని సూచించారని వివరించింది.
ఈ కేసు ఇంతవరకైనా వచ్చిందంటే పవన్ పట్టుదల వలనేనని, అలాంటి వ్యక్తినే ఇప్పుడు ప్రశ్నించడం ఆశ్చర్యకరమని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది.
Read More : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద: 10 గేట్లు ఎత్తివేత.

One thought on “సుగాలి ప్రీతి కేసుపై జనసేన ఘాటైన స్పందన.”
Comments are closed.