అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసిన స్టార్టప్ యజమాని

ఒక భారతీయ స్టార్టప్ యజమాని చేసిన నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిభ ఉన్నదే కానీ, ఇతర మతాలను కించపరిచేలా గతంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా, ఏడాదికి రూ.22 లక్షల జీతం ఆఫర్ చేసిన అభ్యర్థికి ఇచ్చిన ఉద్యోగ నియామకాన్ని రద్దు చేశారు. ఇది “జాబీ” అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అహ్మద్ భాతీ తీసుకున్న నిర్ణయం. లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌ చేసిన ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రతిభ చాలా అభినందనీయం. బడ్జెట్ కంటే ఎక్కువ జీతం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యామని చెప్పారు. కానీ తుది దశ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో భాగంగా అభ్యర్థి గత సోషల్ మీడియా కామెంట్లను పరిశీలించగా, వాటిలో కొన్ని వర్గాలను మతపరంగా కించపరిచేలా ఉన్నాయని గుర్తించారు.
“ఒకరి ప్రతిభ వారిని కంపెనీలోకి తెస్తుంది. కానీ వారి విలువలే వారిని ఇక్కడ కొనసాగించాలో లేదో నిర్ణయిస్తాయి” అని భాతీ వ్యాఖ్యానించారు. అభ్యర్థికి పంపిన ఆఫర్ రద్దు లేఖ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. లేఖలో అభ్యర్థి లింక్డ్‌ఇన్‌ పోస్టులు ఇతర మతాలను దెబ్బతీసేలా ఉన్నాయని, అదే కారణంగా ఆఫర్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై నెట్టింటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ సంస్థ సంస్కృతి కాపాడటమే మేలు అంటుండగా, మరికొందరు మాత్రం దీన్ని “క్యాన్సిల్ కల్చర్”గా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో వేసిన కామెంట్లు, వ్యక్తిగత ప్రవర్తన వృత్తి జీవితం మీద ఎంత ప్రభావం చూపుతాయో ఈ ఘటన మరోసారి చూపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read More : కిటికీ ఫ్రేమ్ ఊడి ప్రయాణికుల్లో భయాందోళనలు

One thought on “అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసిన స్టార్టప్ యజమాని

Comments are closed.