నందిగామ గాంధీ సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపు ఘటనపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న రాజకీయ విరోధాన్ని ప్రజానాయకుడు వైఎస్ఆర్ విగ్రహాలపై చూపించడం దారుణమని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చివరి క్షణం వరకు ప్రజల కోసం ప్రాణాలు అర్పించారని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకమైయ్యాయని షర్మిల గుర్తుచేశారు. “వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన అది వైసీపీ సొంతం కాదు, పేటెంట్ హక్కు కాదు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడి విగ్రహాలను కూల్చడం ఎక్కడి దిక్కుమాలిన చర్య?” అని ఆమె ప్రశ్నించారు.
వైసీపీ ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించడంపై అభ్యంతరం లేదని, కానీ అదే సాకుతో విగ్రహాన్ని తొలగించడం అనైతికమని షర్మిల స్పష్టం చేశారు. “మహానేత మరణం తర్వాత నాటి ప్రభుత్వం గాంధీ సెంటర్‌లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఇప్పుడు దాన్ని తొలగించడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం” అని ఆమె మండిపడ్డారు.
వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చడం ద్వారా ప్రజాభిమానాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశం స్పష్టమవుతోందని ఆమె విమర్శించారు. “వైసీపీకి ఈ విగ్రహాలకు సంబంధం లేదు. ప్రజల మనోభావాలను అవమానపరచడం ఆపాలి. తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం” అని షర్మిల హితవు పలికారు.
Read More : పులివెందుల జడ్పీటీసీ విజయంపై సీఎం కీలక సూచనలు

2 thoughts on “నందిగామ వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు దారుణం: షర్మిల ఆగ్రహం”
Comments are closed.