శ్రీలంక రాజకీయ వర్గాల్లో శుక్రవారం పెద్ద సంచలనం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు, ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత విదేశీ పర్యటన కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలే ఈ అరెస్టుకు కారణమయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే… 2023 సెప్టెంబర్‌లో విక్రమసింఘే తన భార్యతో కలిసి లండన్ వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, దానికి సంబంధించిన ఖర్చులు ప్రభుత్వ నిధులతో తీర్చారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన భార్యతో కలిసి ఒక విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అధికారిక పర్యటన కాదని విక్రమసింఘే తర్వాత స్పష్టం చేశారు. అయితే ఈ ప్రయాణంలో ప్రభుత్వ నిధులు వాడారని, అంగరక్షకుల ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో శుక్రవారం ఉదయం సీఐడీ అధికారులు విక్రమసింఘేను విచారించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే… 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ప్రజల ఆగ్రహంతో నాటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పదవి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పార్లమెంటు ఓటింగ్‌లో విక్రమసింఘే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read More : ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు షహ్రీజ్ ఖాన్ కిడ్నాప్

One thought on “శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్”
Comments are closed.