ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండడంపై అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలు ఇస్తాంబుల్ వేదికగా జరుగుతుండగానే రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల్లో 900కు పైగా డ్రోన్ల దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు.
శనివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులు యుద్ధం మొదలైన మూడు సంవత్సరాల కాలంలోనే అత్యంత తీవ్రంగా నమోదయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. పుతిన్ నిర్దాక్షిణ్యంగా ప్రజలపై దాడులు జరుపుతూ పిచ్చిపట్టు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించాలని పుతిన్ ఆశపడితే, అది చివరికి రష్యా పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు.
అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యవహారశైలి పట్ల కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ తన దేశ ప్రయోజనాలను ముందుండి కాపాడే విధంగా మాట్లాడడం లేదని, ఆయన నిశ్శబ్దంగా ఉంటేనే మంచిదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Read More : ట్రంప్ ఆపిల్‌పై 25% టారిఫ్ హెచ్చరిక.
