దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై సహా పలు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి తక్కువగా ఆదాయం చూపించి పన్ను ఎగవేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు.
మాదాపూర్‌లోని శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ సోదాలు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు రూపంలో ఫీజు వసూలు చేసి, పన్ను రికార్డుల్లో తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు అందించినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఫీజు వసూలు కోసం డ్యుయల్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ
ఈ దాడుల్లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఫీజు వసూలు ప్రక్రియలో విద్యాసంస్థ ప్రత్యేకంగా రెండు సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఒకటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నేరుగా నగదు తీసుకునే సాఫ్ట్‌వేర్ కాగా, మరొకటి ప్రభుత్వానికి పన్ను చెల్లింపు కోసం ఉపయోగించే ప్రత్యేక లెక్కల వ్యవస్థగా ఉంది. ఈ వ్యవస్థ ద్వారా అసలు ఆదాయాన్ని దాచిపెట్టి భారీ స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
భారీగా లెక్కలలో గణనీయమైన తేడాలు
ఐటీ అధికారులు ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం, సంస్థ నిధుల లావాదేవీల్లో అనేక అసంగతతలు బయటపడ్డాయి. విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసినప్పటికీ, ఆదాయ లెక్కల్లో మాత్రం తక్కువగా చూపించారని అధికారులు గుర్తించారు. సంస్థ అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ, ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
అయితే, ఈ దాడులకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సంస్థ యాజమాన్యం కూడా ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

One thought on “శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు: భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలు”
Comments are closed.