కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీపై బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితా చిత్రాన్ని పంచుకున్నారు. ఆ జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని, ఆమె భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో చేరడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన తప్పిదమని మాలవీయ పేర్కొన్నారు.
సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. అనంతరం 1983 ఏప్రిల్ 30న అధికారికంగా భారత పౌరసత్వం పొందారు. అయితే, ఆ తేది కంటే మూడు సంవత్సరాల ముందే, 1980లోనే ఓటర్ల జాబితాలో పేరు చేరడంపై మాలవీయ అనుమానాలు వ్యక్తం చేశారు. “ఇటలీ పౌరురాలి పేరు భారత ఓటర్ల జాబితాలో ఎలా చేరింది? అప్పటి ప్రభుత్వం ఒత్తిడితోనా? లేక గాంధీ కుటుంబం మోసపూరితంగా ఇదంతా జరిగించిందా?” అని వరుస ప్రశ్నలు సంధించారు. ఈ అంశంపై గాంధీ కుటుంబంతో పాటు అప్పటి ఎన్నికల సంఘం అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కొత్త ఆరోపణలతో కాంగ్రెస్ రక్షణలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంపై పార్టీ ఎలా స్పందిస్తుందో ఆసక్తి నెలకొంది.
Read More : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

One thought on “సోనియా గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు”
Comments are closed.