హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో నాటకీయ పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. భర్త వినయ్, అతని సోదరి సరిత కలిసి శిరీషను మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సరిత అక్రమ సంబంధం గురించి శిరీష కుటుంబ సభ్యులకు చెప్పడంతో కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
హత్యకు ముందు గొడవ, క్రూరమైన ప్లాన్
కొద్ది నెలల క్రితం అమెరికా నుంచి వచ్చిన సరిత, శిరీషతో పాటు ఒకే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటుండగా, సరిత తన అక్రమ సంబంధం గురించి శిరీషతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆగ్రహంతో సరిత, వినయ్ కలిసి శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం
శిరీష మృతదేహాన్ని మాయం చేసేందుకు వినయ్, సరిత కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. గుండెపోటుతో శిరీష మృతిచెందిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే శిరీష మేనమామకు అనుమానం రావడంతో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అంబులెన్స్‌ను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు.
పోస్ట్ మార్టమ్‌లో నిజాలు బహిర్గతం
శిరీష మృతదేహానికి వైద్యులు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్‌లో హత్య జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో భర్త వినయ్, అతని అక్క సరితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
