సీఎం చిత్రపటంపై కాంగ్రెస్-బీఆర్ఎస్ ఘర్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించడంతో వివాదం తలెత్తింది.

పూర్తి వివరాల్లోకి వెళితే…
ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చిత్రపటం ఉండాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇరుపార్టీల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చి తోపులాటకు దారితీసింది. ఈ గందరగోళంలో సీఎం రేవంత్ చిత్రపటం ధ్వంసమైంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపక్షాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ చేతి వేలికి గాయమైంది.

అయితే ప్రస్తుతం పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళ చేరింది

One thought on “సీఎం చిత్రపటంపై కాంగ్రెస్-బీఆర్ఎస్ ఘర్షణ

Comments are closed.