భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు: లోకేష్‌

Nara lokesh

భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలో అడుగుపెట్టారు. దాదాపు 41 ఏళ్ల విరామం తర్వాత అంతరిక్షాన్ని తాకిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు. శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరిన ఈ ఘట్టం, దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, శుభాంశు శుక్లా పై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ… “గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా భారత వాయుసేన నుంచి మొదటి ఇస్రో అంతరిక్ష యాత్రికుడిగా చరిత్ర సృష్టించారు. యాక్సియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ఆయన చేసిన ఈ ప్రయాణం చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.శుభాంశు ప్రయాణం భారత అంతరిక్ష రంగానికే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మిషన్ ధైర్యానికి, విజ్ఞానానికి, నూతన భారత ఆత్మకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు.

ఈ సందర్భంగా లోకేష్, శుభాంశుతో పాటు యాక్సియం స్పేస్, నాసా, స్పేస్ ఎక్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో వంటి సంస్థలను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష ప్రయాణ సమయంలో తీసిన శుభాంశు వాహన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.

Read More : విజయనగరం జిల్లా ఎస్.కోటలో భారీ అగ్నిప్రమాదం

One thought on “భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు: లోకేష్‌

Comments are closed.