గుర్తింపు ప్రక్రియపై బంధువుల ఆవేదన

సంగారెడ్డి జిల్లా పాశమైలారులోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటనలో బంధువులను కోల్పోయి, తమ ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్న వారి కుటుంబ సభ్యులు గురువారం పరిశ్రమ గేటు వద్ద నిరసన తెలిపారు. “మా కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి చెప్పండి” అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు మాట్లాడుతూ… సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని, గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి ఇప్పటికే కొంతకాలం గడిచినా… తమ బంధువుల ఆచూకీ ఇంకా తెలియకపోవడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులు స్పందించాలంటూ కోరారు.

ఇకపోతే, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. మృతుల బంధువుల నుంచి నమూనాలు సేకరించి, వాటిని పరిశీలించిన తర్వాతే మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తున్నామని అధికారులు తెలిపారు.

తాజాగా మరో ఐదు మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మృతదేహాలు గుర్తింపు పొందగా… ఇంకా 18 మృతదేహాలు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 11 మంది గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read More : శివ బాలకృష్ణపై ఈడీ సోదాలు ముగింపు

One thought on “గుర్తింపు ప్రక్రియపై బంధువుల ఆవేదన

Comments are closed.