ఆరోగ్య సమస్యలతో సినిమాలు తగ్గించిన సమంత క్లారిటీ

సమంత – దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన నటి. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా మారినా సినిమాలకు గుడ్‌బై చెప్పకుండా వరుస చిత్రాల్లో నటించింది. ఆ సమయంలో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. అయితే ఆ ఇమేజ్‌ను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది. పెళ్లి నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న సమంత సినిమాల సంఖ్యను కూడా తగ్గించింది. ఇకపై సమంత కెరీర్‌పై అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. తాజాగా ఈ విషయంపై సమంత స్పందించింది. తన సినిమాలు తగ్గించడానికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలేనని స్పష్టంగా చెప్పింది.

మయాసైటిస్ వ్యాధి బారిన పడి శరీర బలహీనతకు గురైన సమంత, ఇప్పుడు మళ్లీ కోలుకుంటోంది. “ప్రస్తుతం నా ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నాను. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నప్పుడే సినిమాలు చేయగలం. అందుకే ఒకేసారి ఐదు ఆరు సినిమాలు చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. నా శరీరం అనుకూలిస్తేనే ప్రాజెక్టులు అంగీకరిస్తున్నాను. వర్క్‌లోడ్ తగ్గించుకున్నా, కానీ నేను చేసే సినిమాల్లో క్వాలిటీ మాత్రం తగ్గదు” అని సమంత స్పష్టం చేసింది.

ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా ఆమె నిర్మించిన శుభమ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.

సమంత సందేశం స్పష్టంగా ఉంది – డబ్బు, కెరీర్ కంటే ఆరోగ్యం ముఖ్యమని. ఆరోగ్యంగా ఉంటేనే ఎంటర్టైన్‌మెంట్ రంగంలో నిలబెట్టుకోగలమని ఆమె చెబుతోంది.

Read More : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్టు