రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఆ ?

రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో అమెరికా మరింత స్పష్టతకు వచ్చినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు గణనీయమైన శ్రమ పెట్టారని, అయితే ఇకనైనా సంధి సాధ్యమో కాదో తేల్చాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

యూరోపియన్, ఉక్రెయిన్ నేతలతో సమావేశానంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ — ‘‘మా అధ్యక్షుడు ట్రంప్ ఎంతో గట్టిగా ఈ యుద్ధాన్ని ముగించేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో స్పష్టమైన పురోగతి కనిపించకపోతే, మరికొంతకాలం దీన్ని కొనసాగించడంలేదని, తాము తమ దారితమై చూసుకుంటామని’’ తెలిపారు.

ఇటీవల ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం కూడా త్వరలో కుదిరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రూబియో చేసిన తాజా వ్యాఖ్యలు, అమెరికా వైఖరిని మరింత స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.

సంధి కుదరాలని ట్రంప్ ఆసక్తిగా ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని రూబియో గుర్తుచేశారు. ‘‘మేము వారాల తరబడి లేదా నెలలు పాటు ఈ ప్రయత్నాలు కొనసాగించం. పరిష్కారం సాధ్యమవుతుందో లేదో తేలిపోవాల్సిన సమయం ఇదే’’ అంటూ స్పష్టం చేశారు.