సిరియా: యుద్ధ బీభత్సం ఇంకా ముగిసేలా లేదు
సిరియాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఎయిర్ స్ట్రైక్‌లు, బాంబుల వర్షం ఆగడంలేదు. గత 48 గంటల్లో సిరియాపై ఇజ్రాయెల్ 480 దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, 15 నావల్ వెజెల్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీలు పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించారు.
మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ కూలిపోవడంతో శరణార్థులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే, దాడుల ధాటికి వారి ఆశలు మసకబారుతున్నాయి. సిరియాలో తిరుగుబాటు దారులు అధికారం చేపట్టిన తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి.
సిరియా తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ అల్ బషర్ స్పందిస్తూ, ప్రస్తుతం దేశానికి అవసరం శాంతి, స్థిరత్వమని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే, సిరియాలో ఉన్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. దౌత్య కార్యాలయాల సహకారంతో 77 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో సిరియాలో ప్రజలు శాంతి కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, వారి మార్గం ఇంకా కష్టసాధ్యంగా ఉంది.
