మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ గాయం

మాంచెస్టర్‌లో బుధవారం ప్రారంభమైన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా మైదానం విడిచాడు. చివరి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన పంత్, బ్యాట్ ఎడ్జ్ తగిలి బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తాకింది. వెంటనే షూ తీసి చూడగా పాదం నలిగిపోయి రక్తస్రావం కనిపించింది. ఫిజియో వెంటనే మైదానంలో చికిత్స చేసినప్పటికీ పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. కాలుపై బరువు పెట్టలేని స్థితిలో ఉండడంతో మొబైల్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ కోసం పంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సహచర ఆటగాడు సాయి సుదర్శన్ తెలిపారు. గాయ సమయంలో పంత్ 48 బంతుల్లో 37 పరుగులతో ఆడుతున్నాడు. గాయం తీవ్రంగా ఉండటంతో మిగిలిన మ్యాచ్‌లు అతడు ఆడతాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది పంత్‌కు రెండోసారి గాయం కావడం గమనార్హం. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేస్తూ వేలికి గాయమైన పంత్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.

ప్రస్తుత సిరీస్‌లో పంత్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 70.83 సగటుతో 425 పరుగులు చేసి, రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు బాదుతూ, భారత్ తరఫున ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన తొలి కీపర్-బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఒకవేళ పంత్ మిగతా మ్యాచ్‌లకు దూరమైతే టీమిండియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.

Read More : ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇండియా–ఇంగ్లండ్ నాలుగో టెస్టు ప్రారంభం

One thought on “మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ గాయం

Comments are closed.