రెవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యయాలు, ఉద్యోగ సంఘాల ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన… ఆర్థిక పరిస్థితులు, తన విధానాలు, కేంద్ర ప్రభుత్వ స్పందనలపై కీలకంగా స్పందించారు.

రాష్ట్రం అప్పుల భారం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. “ఉద్యోగ సంఘాలు నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవు. నేను కామన్ మ్యాన్‌లా ఎకానమీ టికెట్‌ తీసుకొని విదేశాలకు వెళ్తున్నా,” అని చెప్పారు. అప్పు అడగడానికి కేంద్రానికి వెళ్తే, దొంగను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఢిల్లీకి వెళితే చెప్పులు ఎత్తుకుపోతాడేమో అనిపిస్తుంది వారికీ. అందుకే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదు. నన్నెవ్వరు నమ్మడంలేదు,” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రస్తుతం పూర్తిగా దివాళా తీసిందని, అయితే శాంతి భద్రతలు సమర్థంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్లే అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ పథకాల అమలుకు మేమే బాధ్యత వహించాలా? అని ఆయన ఉద్యోగ సంఘాలపై మండిపడ్డారు. “ప్రజలకు పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ — ఇవన్నీ మేమే చేయాలా? ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదా?” అని నిలదీశారు.

ధరలు పెంచితేనే పథకాలు అమలవుతాయని వివరించారు. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు నష్టమేనని హెచ్చరించారు.

మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శలపై కూడా స్పందించారు. “కేసీఆర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించి వెళ్తున్నారు. పథకాలు ఫెయిలయ్యాయని చెప్పడం ద్వారా పైశాచికానందం పొందుతున్నారు” అని మండిపడ్డారు.

Read More : బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శలు