ఆర్సీబీ విషాదంపై స్పందన ?

ఐపీఎల్ 2025 టైటిల్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది. అయితే అదే సంబరాలు ఘోర విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దాదాపు మూడు నెలల పాటు మౌనం పాటించిన ఆర్సీబీ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది.

శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా ‘ఆర్సీబీ కేర్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు యాజమాన్యం సోషల్ మీడియాలో ప్రకటించింది. “జూన్ 4న మేము 11 మంది ఆర్సీబీ కుటుంబ సభ్యులను కోల్పోయాం. వారి లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. కానీ తొలి అడుగుగా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఐక్యతకు, సంరక్షణకు మేము ఇచ్చిన వాగ్దానం” అని పేర్కొంది.

జూన్ 3న అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ, మరుసటి రోజే బెంగళూరులో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చిన వేళ భద్రతా లోపాల కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనపై ఆర్సీబీ ఆలస్యంగా స్పందించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక సహాయం కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ, అభిమానులు ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. గాయపడిన వారికి కూడా సహాయం అందిస్తామని ఫ్రాంచైజీ హామీ ఇచ్చింది.

Read More : బ్రోంకో టెస్ట్ వివాదం.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై ప్రశ్నలు