ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. “మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే, దాన్ని ఆచరణలో పెట్టి విజయవంతం కావడానికి ఆంధ్రప్రదేశ్ మీకు సరైన వేదిక అవుతుంది” అని భరోసా ఇచ్చారు. మంగళగిరిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ (RTIH)ను టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత ఆలోచనలకే కీలకస్థానం ఉందని స్పష్టం చేశారు. ఆవిష్కరణలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటునిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. “ఆలోచనలపై పెట్టుబడి పెట్టడం అంటే మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టినంతే ముఖ్యమైనది. అందుకే రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు అనువైన పర్యావరణాన్ని సృష్టిస్తున్నాం. క్షేత్రస్థాయిలో వెలువడే ఐడియాలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన వేదికగా నిలుస్తుంది” అని వివరించారు.
ఈ హబ్ ద్వారా వినూత్న ఆలోచనలకు మార్గనిర్దేశం, నిధులు, సరైన గుర్తింపు లభిస్తుందని చంద్రబాబు తెలిపారు. అలాగే, కొత్త నినాదాన్ని ప్రవేశపెట్టారు. “ఇంతకు ముందు ‘ఇంటికి ఒక ఐటీ నిపుణుడు’ అన్న పిలుపు ఇచ్చాను. కానీ కాలం మారింది, టెక్నాలజీ మారింది. కాబట్టి ఇప్పుడు ‘ఇంటికి ఒక పారిశ్రామికవేత్త’ అన్న కొత్త పిలుపునిస్తున్నాను. ప్రతి కుటుంబం కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి” అని పిలుపునిచ్చారు.
ఆవిష్కరణలతో పాటు సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచిన రతన్ టాటా స్ఫూర్తితో ఈ హబ్ ఏర్పాటు చేశామని, ఈ చారిత్రక సందర్భంలో భాగస్వామ్యులైన నటరాజన్ చంద్రశేఖరన్‌తో పాటు ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read More : తూర్పు గోదావరిలో రేవ్ పార్టీ

One thought on “ఆవిష్కరణలకు నూతన వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం”
Comments are closed.