ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లకు నూతన యుగానికి నాంది పలికే ఘన కార్యక్రమం జరిగింది. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ (RTIH)ను ముఖ్యమంత్రి చంద్రబాబు, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం రోజే ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే 1,67,321 ఇన్నోవేషన్‌లు, బిజినెస్ స్టార్టప్‌లు రిజిస్టర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ ఘనతను గుర్తిస్తూ గిన్నిస్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అధికారిక ధృవపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ఆవిష్కరణల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. రతన్ టాటా నిరాడంబరత, సమాజ సేవ అందరికీ ఆదర్శమని ప్రశంసిస్తూ, ఆయన ‘గివ్ బ్యాక్ టు ది సొసైటీ’ తత్వం ఈ ఇన్నోవేషన్ హబ్‌కు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. యువత ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఇన్నోవేషన్ కేంద్రం అమరావతి మాత్రమే కాకుండా ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలోనూ ఏర్పాటవుతుంది. భవిష్యత్తులో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వరకు విస్తరించడం లక్ష్యమని తెలిపారు. “ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే మా నినాదం. ఇందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక పాత్ర పోషిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో ‘క్వాంటం వ్యాలీ’, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టితో పాటు పేదరిక నిర్మూలన లక్ష్యంగా ‘పీ4’ (ప్రజా భాగస్వామ్యంతో పేదరికంపై పోరాటం) ద్వారా ఏపీని ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ’గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దార్శనికతతో తక్కువ కాలంలోనే ఇన్నోవేషన్ హబ్ రూపుదిద్దుకోవడం అభినందనీయం అని అన్నారు. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు అనేక రంగాల్లో వినూత్న పరిష్కారాలకు ఇది వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, పారిశ్రామికవేత్తలు బాబా కల్యాణి, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం స్టార్టప్ కంపెనీల స్టాళ్లను సందర్శించి, వారి ఆవిష్కరణలను పరిశీలించారు.
Read More : ఆవిష్కరణలకు నూతన వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

One thought on “ప్రపంచ రికార్డు సాధించిన స్టార్టప్ విప్లవం”
Comments are closed.