హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల బీజేపీలో తమ పార్టీ విలీనం కాబోతోందన్న వ్యాఖ్యలు చేశారని, అవే నిజమైపోయే అవకాశముందని రాజాసింగ్ పేర్కొన్నారు. పెద్ద ప్యాకేజీ లభిస్తే తమ పార్టీలో కొందరు నేతలు ఎప్పుడో బీజేపీని బీఆర్‌ఎస్‌లో కలిపేసేవారని వ్యాఖ్యానించారు.
ఒకవేళ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా బీఆర్‌ఎస్ నాయకులే నిర్ణయించే పరిస్థితి వస్తుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాల వల్ల బీజేపీకి భారీ నష్టం వాటిల్లిందని, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగలేదన్నారు.
ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేసిన రాజాసింగ్, పార్టీ లోపల ఉన్న పరిస్థితులను బహిర్గతం చేశారు. “ప్రతి ఎన్నికలో బీజేపీ నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారు. ఈ విషయం ప్రతి కార్యకర్తకు తెలుసు. కానీ, ఎవరు బయటకు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే సస్పెండ్ చేసే భయం ఉంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై గతంలో కూడా రాజాసింగ్ పార్టీపై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బీజేపీ నేతలు అధికార పార్టీకే అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు అప్పటికీ చేశారు.
ఇక తాజా పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Read More : ఖైరతాబాద్ ఎమ్మెల్యే అనుచరుడి దురుసు మాటలు.

One thought on “బీజేపీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.”
Comments are closed.