ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం కీలక వ్యక్తిని అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే… చెవిరెడ్డి తన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడుతో కలిసి బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు పారిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో, లుక్ అవుట్ నోటీసు నేపథ్యంలో విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అడ్డగించారు. వెంటనే సమాచారం అందుకున్న ఏపీ సిట్ బృందం బెంగళూరుకు చేరుకుని నిన్న రాత్రి వారిద్దరినీ అరెస్టు చేసింది.

ఈ అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. చెవిరెడ్డిని, వెంకటేశ్ నాయుడును ఈ సాయంత్రం విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నట్టు అధికారులు తెలిపారు.

సిట్ దర్యాప్తులో మరో కీలక విషయమూ వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డితో సంబంధాలున్న చెవిరెడ్డికి భారీ మొత్తంలో మద్యం ముడుపుల డబ్బు చేరిందని అధికారులు గుర్తించారు. అదే డబ్బును వైసీపీ అభ్యర్థులకు పంపించినట్టు ఆరోపణలు ఉన్నాయనీ విచారణలో తేలింది. ఇప్పటికే చెవిరెడ్డి వద్ద పనిచేసిన గన్‌మెన్‌ సహా పలువురిని విచారించిన సిట్, వారి ద్వారా ఈ కీలక సమాచారం పొందినట్టు సమాచారం.

ఈ కేసులో వైసీపీకి చెందిన ప్రముఖ నేతను అరెస్టు చేయడం, ఆయనపై మద్యం ముడుపుల ఆరోపణలు ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీపై నిందల వేగం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More : పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్ – భారీ భద్రతా ఏర్పాట్లు

One thought on “ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి అరెస్టు

Comments are closed.