రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కులగణన చేపట్టలేకపోవడం తన తప్పే అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘భాగిదారి న్యాయ సమ్మేళన్’లో మాట్లాడిన ఆయన, 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పెద్ద తప్పు చేశానని అర్ధమవుతోందని చెప్పారు. అప్పట్లో ఓబీసీల హక్కులను రక్షించడంలో విఫలమయ్యానని, వారి సమస్యలను లోతుగా అర్ధం చేసుకోలేకపోయానని స్పష్టంచేశారు. “ఓబీసీల చరిత్ర, సమస్యలను ముందుగానే అర్ధం చేసుకుని ఉండి ఉంటే అప్పట్లోనే కులగణన చేపట్టేవాడిని. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు, పూర్తిగా నా తప్పే. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం” అని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న కులగణన దేశానికి రోల్ మోడల్‌గా ఉందని పేర్కొన్న రాహుల్, దేశవ్యాప్తంగా కులగణన జరిగే వరకూ విశ్రాంతి తీసుకోనని శపథం చేశారు. అవకాశాలు అందరికీ సమానంగా రావాలంటే, తమ శక్తిని తాము గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు.

దళితుల చరిత్రను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాశారని, అయితే ఓబీసీల చరిత్ర ఎక్కడుందో ప్రశ్నించారు. ఈ చరిత్ర రాయనివ్వకపోవడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఓబీసీలు అన్ని రంగాల్లోనూ వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“కార్పొరేట్ ఇండియాలో ఓబీసీల స్థానం ఎక్కడుంది? అదానీ ఓబీసీనా? మీడియా రంగంలో వారికి చోటు ఎక్కడ?” అని రాహుల్ నిలదీశారు. విద్యే అభివృద్ధికి మార్గమని, ఇంగ్లీషు నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయని చెప్పారు. బీజేపీ నేతలు ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నారని విమర్శిస్తూ, “వాళ్లు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు?” అని ప్రశ్నించారు.

ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Read More : చెన్నైలో విజయవంతమైన హైడ్రోజన్ రైలు కోచ్ పరీక్ష