బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా శనివారం సీతామఢీలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల పేర్లు అక్రమంగా తొలగించబడ్డాయని ఆరోపించారు. “ఇది స్పష్టమైన ఓట్ల దొంగతనం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి. గతంలో మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకలో ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు బిహార్‌లో పునరావృతం చేస్తున్నారు. కానీ బిహార్ ప్రజలు తమ ఓటు హక్కు తస్కరణను సహించరు” అని ఆయన హెచ్చరించారు.
తొలగించిన ఓట్లలో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలవేనని రాహుల్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఈ ఓట్ల చోరీకి సంబంధించి మరిన్ని ఆధారాలు బయటపెడతానని స్పష్టం చేశారు. కొంతమంది పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేందుకే బీజేపీ ప్రజల ఓటు హక్కును కాలరాస్తోందని విమర్శించారు. దొంగిలించిన ఓట్లతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్థానిక సీతాదేవి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 17న ప్రారంభమైన ‘ఓటర్ అధికార్ యాత్ర’ 16 రోజుల పాటు 1,300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది.
Read More : బీహార్‌లో ఉగ్రవాదుల చొరబాటు.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్

One thought on “రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు”
Comments are closed.