హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల విలయం

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు విపరీతమైన విలయం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది జూన్ 20న వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (HPSDMA) గణాంకాల ప్రకారం, ఆగస్టు 27 వరకు మృతుల సంఖ్య 310కి చేరింది. వీరిలో 158 మంది నేరుగా వర్ష కారణంగా – కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, వరదల్లో కొట్టుకుపోవడం, విద్యుత్ షాక్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. మరో 152 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అదనంగా 369 మంది గాయపడ్డారు, 38 మంది గల్లంతయ్యారు.

ఈ విపత్తులో మండి జిల్లా అత్యధికంగా దెబ్బతింది. అక్కడ 51 మంది ప్రాణాలు కోల్పోగా, కాంగ్రాలో 49, చంబాలో 36, సిమ్లాలో 28 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి. మౌలిక సదుపాయాలకు భారీ నష్టం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టం విలువ రూ.2,62,336.38 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బుధవారం సాయంత్రం నాటికి రెండు జాతీయ రహదారులతో సహా 582 రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా కులు, మండి, కాంగ్రా, సిమ్లా జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. కులు జిల్లాలో ఎన్‌హెచ్-03, ఎన్‌హెచ్-305 రహదారులను మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,155 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 346 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా విద్యుత్, నీటి సరఫరా అనేక ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతిన్నది.

Read More : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

One thought on “హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల విలయం

Comments are closed.