అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు – మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో ఆరు నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు మార్గం సుగమమైందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళవారం బెంగళూరులోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల (GCCs) ప్రతినిధులతో కలిసి రోడ్‌ షో నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీలో శరవేగంగా ముందుకు పోతోంది. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో రాష్ట్రం అపార అవకాశాలను కలిగి ఉంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. ఇది భారతదేశ సాంకేతిక రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుంది’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడిదారుల అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వం ఉత్తమమైన ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. అధునాతన సాంకేతికతలకు కేంద్రంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం’’ అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Read More : ఆలయ భూముల్లో అక్రమాలపై తీసిన చర్యలపై ఘర్షణ

One thought on “అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు – మంత్రి

Comments are closed.