మలయాళ నటుడు, దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్‌కు ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘జనగణమన’, ‘కడువ’, ‘గోల్డ్’ వంటి 2022 చిత్రాల నిర్మాణానికి సంబంధించిన లావాదేవీలపై ఈ నోటీసులు వచ్చాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘ఎల్ 2’ సినిమా విడుదల సమయంలోనే ఈ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ స్పష్టమైన డెడ్‌లైన్ కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పృధ్వీరాజ్ తల్లి, ప్రముఖ నటి మల్లికా సుకుమారన్ ధైర్యంగా స్పందించారు. “విచారణకు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పినట్లుగానే విచారణకు హాజరవుతాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. మా డేటా అంతా స్పష్టంగా ఉంది. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ధైర్యం, స్పష్టత అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా, ఈ నోటీసులు రాజకీయ నేపథ్యంతో జారీ అయ్యాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 2022లో విడుదలైన సినిమాలకు సంబంధించిన విషయాలపై ఇప్పుడే స్పందించడాన్ని చాలా మంది అనుమానంతో చూస్తున్నారు. ముఖ్యంగా ‘ఎల్ 2’ చిత్రంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి.
సినిమా మీద దాదాపు 24 కట్స్ విధించినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమాకు తిరుగులేకుండా దూసుకెళ్లింది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయినా, తెలుగులో మాత్రం తక్కువ ఆదరణనే ఎదుర్కొంది.

One thought on ““డేటా క్లియర్.. భయమే లేదు” – పృధ్వీరాజ్ తల్లి కౌంటర్”
Comments are closed.