తాడేపల్లిలో గోరంట్ల మాధవ్‌పై మరో కేసు నమోదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో క్రిమినల్ కేసు నమోదు అయింది. మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. త్వరలో మాధవ్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వివాదం మరింత ఉత్కంఠను రేపింది. శుక్రవారం గుంటూరులో గోరంట్ల మాధవ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహంతో వ్యవహరించారు. సోషల్ మీడియా ద్వారా వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి తీసుకొస్తున్న సమయంలో మాధవ్, తన అనుచరులతో కలిసి పోలీసు వాహనాన్ని వెంబడించి, దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడాన్ని కూడా ఆయన లెక్కచేయకుండా, గుంటూరు ఎస్పీ కార్యాలయం వరకు వెంబడించి, అక్కడ కూడా కిరణ్‌పై మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలో గోరంట్ల మాధవ్‌తో పాటు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని, నగరంపాలెం పోలీస్ స్టేషన్, అనంతరం నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించడం, అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి ప్రయత్నించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, కిరణ్‌ను తరలిస్తున్న వాహనం ఎక్కడ ఉంది, ఏ రూట్‌లో తీసుకొస్తున్నారు అనే సమాచారం గోరంట్ల మాధవ్‌కు ముందే ఎలా తెలిసిందనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు వ్యవస్థలో ఉన్న కొందరి వైఎస్సార్ కాంగ్రెస్ అనుబంధ అధికారుల నుంచే సమాచారం లీక్ అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read More : పోసాని కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

One thought on “తాడేపల్లిలో గోరంట్ల మాధవ్‌పై మరో కేసు నమోదు

Comments are closed.