తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ అధికారులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడం ప్రారంభించిన సిట్ అధికారులు, తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరి హడావిడి సృష్టించారు.
కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. మహేష్ కుమార్ గతంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల డేటా విశ్లేషణలో మహేష్ కుమార్ సంబంధిత సమాచారం లభించడంతో, ఆయన ఫోన్ ట్యాప్‌కు గురైందని సిట్ గుర్తించింది.
ఇప్పటి దాకా సిట్ అనేకమంది బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయగా, ఈరోజు మహేష్ కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నలుగురు సహ నిందితులు – ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు – సిట్ విచారణకు హాజరయ్యారు.
ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా విచారణ సాగుతున్న ఈ దశలో, నిందితులంతా ఒకేసారి విచారణకు హాజరుకావడంతో దర్యాప్తు పురోగతికి అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు జరిగిన విచారణలో ప్రభాకర్ రావు సహకరించకపోవడంతో, సమాచారం సేకరణలో సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సిట్ అధికారుల ప్రశ్నలకు ప్రత్యుత్తరంగా ఎదురు ప్రశ్నలు వేస్తుండటంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారిందని సమాచారం.
సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోన్న ఈ సమయంలో, తదుపరి దశల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా.
Read More : కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడం CM చేతకానితనానికి నిదర్శనం:

One thought on “టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్ నమోదు”
Comments are closed.