హైకోర్టులో హర్షకుమార్‌కు షాక్: పాస్టర్ ప్రవీణ్ పిల్‌పై కీలక వ్యాఖ్యలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో (పిల్) హైకోర్టు మాజీ ఎంపీ హర్షకుమార్‌కు చుక్కెదురైంది. హర్షకుమార్ తరపున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం సీరియస్‌గా పరిగణించకుండా పలు కీలక ప్రశ్నలు సంధించింది.

పాస్టర్ ప్రవీణ్ మరణంపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలంటూ హర్షకుమార్ వేసిన పిల్‌పై నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది బీ. బాల వాదనలు వినిపిస్తూ మృతదేహానికి రీపోస్ట్‌మార్టం అవసరమని కోరారు.

ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నలు సంధిస్తూ.. ప్రవీణ్ హత్యకు గురయ్యాడని నిశ్చయంగా చెప్పడానికి ఏవైనా ఆధారాలున్నాయా? అని అడిగింది. మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు ఫోటోలు ఉన్నాయని, తర్వాత అతను వాహనం నడిపినట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. వీటిని ప్రమాదకర కలయికగా అభివర్ణించింది.

ఇంతకీ పిటిషన్ దాఖలు చేసిన హర్షకుమార్‌కు బాధిత కుటుంబంతో ఏ సంబంధం ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే రెండు పిల్‌లు దాఖలై ఉండగా మళ్లీ మరో పిల్ అవసరమా అని అడిగింది. ప్రజా ప్రయోజన పిల్‌కు సంబంధించి హర్షకుమార్ రూ.5 లక్షలు కోర్టు రిజిస్ట్రీలో రెండు వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణ జరుపుతామని తెలిపింది. అలాగే, ఇదివరకే దాఖలైన పిల్‌లతో ఈ పిల్‌ను కలపాలని సూచించింది.

Read More : పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు

One thought on “హైకోర్టులో హర్షకుమార్‌కు షాక్: పాస్టర్ ప్రవీణ్ పిల్‌పై కీలక వ్యాఖ్యలు

Comments are closed.