ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలపై ఏసీబీ చేపట్టిన దర్యాప్తులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సెల్‌ఫోన్‌ను అప్పగించాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జారీ చేసిన నోటీసుపై కేటీఆర్ స్పందించారు. ఆయన ఈ మేరకు ఏసీబీకి లేఖ రాశారు.
లేఖలో… సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కోరింపు తన ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా పలు కేసుల్లో స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు.
ఏసీబీ నోటీసుపై స్పందన ఇవ్వేముందు కేటీఆర్ న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. న్యాయపరంగా సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను అధికారులు తీసుకోవాలంటే పటిష్ట కారణాలు ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని అప్పగించాల్సిన అవసరం లేదని న్యాయవాదులు సూచించారని తెలుస్తోంది.
ఈ న్యాయ సలహా మేరకే కేటీఆర్ ఏసీబీకి లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆయన తగినంత సహకారం అందిస్తానని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలోకి మరిన్ని పేర్లు రావచ్చన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
Read More : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై యువతి ఆత్మహత్యతో కలకలం
