నారా లోకేశ్‌ కేంద్ర మంత్రి మాండవీయను కలిసిన సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన భేటీలో లోకేశ్‌ ఈ విజ్ఞప్తిని చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని, ఇందుకోసం కేంద్రం సహకరించాలన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు, అథ్లెట్లకు అవసరమైన శిక్షణ, సౌకర్యాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడలోని డీఎస్ఏ గ్రౌండ్‌లో హాకీ, షూటింగ్ విభాగాలకు సంబంధించి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన రూ. 341.57 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరారు.

తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, అదే ప్రాంతంలో అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడాకారుల ప్రయాణ సౌలభ్యం కోసం రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్‌లను మంజూరు చేయాలని కోరారు. అలాగే ఏపీలోని ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు స్పందించిన కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను విస్తృత పరుస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేశ్, యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని మాండవీయకు అందజేశారు.

Read More : హైకోర్టులో హర్షకుమార్‌కు షాక్: పాస్టర్ ప్రవీణ్ పిల్‌పై కీలక వ్యాఖ్యలు

One thought on “నారా లోకేశ్‌ కేంద్ర మంత్రి మాండవీయను కలిసిన సమావేశం

Comments are closed.