తల్లిదండ్రుల‌కు హెచ్చరిక: డ్ర‌గ్స్‌ మాయ‌లో పిల్ల‌లు..

నేటి వేగ‌మైన జీవ‌న‌శైలిలో మాన‌సిక ఒత్తిడి, ఒంట‌రిత‌నం, సోషల్ మీడియా ప్రభావంతో టీనేజర్లు (13-19 ఏళ్ల వయస్సు) మాదకద్రవ్యాలు, ఇతర మత్తుపదార్థాల వలలో చిక్కుకునే ప్రమాదం అధికంగా ఉంది. వీటి వినియోగం శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు.

తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు
మీ పిల్లలు డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్ల బాటపడుతున్నారని అనుమానం వచ్చినప్పుడు కోపంగా ఉండకుండా ప్రేమగా, సహనంగా మాట్లాడాలి. వారిని తిట్టడం, బెదిరించడం వల్ల వారు మరింత దూరమవుతారు. సమస్యను అధిగమించాలంటే స్నేహపూర్వకంగా వారి హృదయాన్ని నమ్మించాలి.

ఆదర్శంగా ఉండండి
తల్లిదండ్రులే తాము స్వయంగా ధూమపానం, మద్యం, డ్రగ్స్‌ లాంటి అలవాట్లకు దూరంగా ఉండి పిల్లలకు రోల్ మోడల్స్‌గా ఉండాలి.

వారిని వినండి, మార్గనిర్దేశం చేయండి
వారితో బహిరంగంగా మాట్లాడటం, వాళ్లు ఎదుర్కొంటున్న ఒత్తిడులపై శ్రద్ధ పెట్టడం కీలకం. డ్రగ్స్ వలన ఆరోగ్యంపై, చదువుపై, భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలపై సరైన అవగాహన ఇవ్వాలి.

చెడు సహవాసం నుంచి రక్షించండి
చెడు స్నేహితుల ప్రభావంతో పిల్లలు మత్తుపదార్థాల బాట పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, వాళ్ల స్నేహితుల గురించి తెలుసుకోవాలి.

డ్రగ్స్‌కు బానిసైన పిల్లలను ఇలా గుర్తించండి:

  • ప్రవర్తనలో మార్పు
  • కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండడం
  • చదువులో వెనుకబడటం
  • రాత్రుళ్లు ఇంటికి ఆలస్యంగా రావడం
  • శరీరంపై కాలిన దృశ్యాలు కనిపించడం
  • తరచూ డబ్బు అడగడం
  • మూర్ఛలు రావడం

తల్లిదండ్రులకు సూచనలు:

  • పిల్లల గది, బ్యాగు, జేబులు క్రమం తప్పకుండా చెక్ చేయండి
  • ఖర్చులకు పరిమితంగా డబ్బు ఇవ్వండి
  • వారితో నిత్యం సమయం గడపండి
  • మత్తు పదార్థాల ప్రమాదాలపై చక్కటి అవగాహన కల్పించండి

పిల్లలు భవిష్యత్తుకు పునాది. వారు ఈ మత్తు మాయలో పడకుండా రక్షించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత.

Read More : బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టే ఆరోగ్యకరమైన అలవాట్లు