భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ భద్రతకు ముప్పు కలిగిస్తే, చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. “మాకేదైనా జరిగితే, అక్కడ (భారతదేశంలో) ఎవ్వరూ మిగలరని” ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇటీవలి పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన చర్యలు, ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల ఇరు దేశాల సంబంధాలు మరింత తలకిందులయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మంత్రులు తరచూ భారత్ దాడికి సిద్ధమవుతోందని నిఘా వర్గాల సమాచారం ఉందని చెబుతున్నారు.
ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఆసిఫ్ మాట్లాడుతూ, ఉగ్రవాద సంస్థలు టీటీపీ, బీఎల్ఏలు భారత్కు ప్రతినిధుల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. రెండు వైపులా శత్రువుల నడుమ తాము ఉన్నామని పేర్కొన్నారు.
భారత ప్రధాని మోదీని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పోల్చిన ఆసిఫ్, ఇద్దరూ అహంకారపూరితంగా రాజకీయ ప్రయోజనాల కోసం ముప్పుతో కూడిన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. యుద్ధం జరిగితే అది నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్ అంతర్భాగాల్లోకి చొచ్చుకుపోతుందని, దాన్ని అదుపు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఇంతటితో ఆగకుండా, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ‘యుద్ధ చర్య’గా అభివర్ణించారు. “మా నీటిని ఆపాలని ప్రయత్నిస్తే, ఎలాంటి నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం. భవిష్యత్ యుద్ధాలు నీటి కోసమే జరుగుతాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా స్పందిస్తూ, తమ జాతీయ గౌరవం కోసం పూర్తి స్థాయి బలంతో ఎదురుతెన్నుకుంటామని పేర్కొన్నారు. పాక్ సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ ఇప్పటికే “రాబోయే 24-36 గంటలు కీలకం” అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయనే భావన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Read More : గాజాలో భవనం పేల్చి జెండర్ రివీల్ పార్టీ..?

One thought on “పాక్ రక్షణమంత్రి తీవ్ర హెచ్చరికలు”
Comments are closed.