ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రరూపం దాల్చాయి. తాజాగా కీవ్ నగరంపై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో రష్యా తీవ్ర దాడికి దిగిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల వల్ల అనేక నివాస భవనాలు, ఆసుపత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారికి సహాయం అందించేందుకు భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. ఇక ఒడెసా నగరంపై దాదాపు 20 డ్రోన్లు, పలు క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ధ్రువీకరించారు. దాడుల వలన భారీ ఆస్తి నష్టం సంభవించిందని, ఈశాన్య సుమీ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ క్రమంలో జెలెన్‌స్కీ మిత్ర దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సహాయ సామగ్రిని అందిస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సాయంలో భాగంగా ఆస్ట్రేలియా, ఎం1ఏ1 అబ్రమ్స్ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందజేసింది. రాబోయే నెలల్లో మరిన్ని ఆయుధాలను పంపించనున్నట్లు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ప్రకటించారు. మాస్కో చేపడుతున్న అనైతిక దాడులను ఎదుర్కొనడంలో ఉక్రెయిన్‌కు సహాయపడటం తమ బాధ్యత అని ఆస్ట్రేలియా ప్రకటించింది.

Read More : రిపోర్టింగ్ చేయడానికి అంత సాహసం చేయాలా?

One thought on “ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దాడులు

Comments are closed.